తెలుగు తల్లి వైభవ విభావరి

శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యదీప్తి

పల్లవరాజ పాలకుల పాలనా పటిమ

ఇక్ష్వాకు, విష్ణు కుండినుల ధర్మ దీక్ష

బృహత్పలాయనుల భవ్య తేజము

చాళుక్య, గాంగ, చోళుల పాండితీ ప్రకర్ష కాకతి,

రెడ్డి, వెలమరాజుల వీర విక్రమము

సాళ్వ ,తుళువ, గజపతుల సాహితీ శోభ పొంగి పొరలిన ఈ సీమ

దివ్య తెలుగు సీమ యుగంధర,తిక్కన్న ,అప్పాజీ ల మహితశక్తి

అక్కన్న, మాదన్న ఘన మంత్రిత్వ పటిమ అమరసింహ,ఆపస్తంభ,నాగార్జునాది విజ్ఞాన ఖనులు విద్యారణ్య, పండితారాద్య,వల్లభుల జ్ఞాన తేజస్సు

నన్నయ్య,తిక్కన్న,పోతన్న,పెద్దనాదుల కవితా లతికలు రుద్రమ్మ, ప్రతాపరుద్ర, రాయల ఖడ్గ చాలనము

బ్రహ్మన్న, నాగమ్మ, మాంచాల ఘన పౌరుషాగ్ని పొంగి పొరలిన ఈ సీమ దివ్య తెలుగు సీమ

త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసాదుల సంగీత మధుర ధార

అన్నయ్య, సదాశివబ్రహ్మేంద్ర,తీర్థుల గీత తరంగిణులు సిద్ధేంద్ర, జాయప సేనానుల ఘన నృత్య వైభవమ్ము

అమరావతీ,శ్రీశైల,లేపాక్షి,హంపీ శిల్ప కళా సోయగమ్ము కవిగాయక,

వైతాళికుల్ గొల్వుదీరిన భువన విజయమ్ము క్రిష్ణమ్మ, పెన్నమ్మ, గోదావరీ పావన జలమ్ముల గలంగలలు వీది వీదుల మిరుమిట్లు గొల్పు రత్న ,ముత్యాల సంపదల్లు పొంగి పొరలిన ఈ సీమ దివ్య తెలుగు సీమ

ఏవి తల్లీ నిరుడు కురిసిన ఆ దివ్య హిమసమూహమ్ములు నిర్వీణ నిద్రాణమై తెలుగు తేజమ్ములు చేష్టలుడిగిపోయే కలహాల కాపురమ్ముల, స్వార్థ బుద్ధుల , హీనుల వశమాయె నేడు అంతరించ సాగె తేనెలూరు తెలుగు పాండిత్య వైభవమ్ము కన్నుమరుగై పోయె ఆ దివ్య లలిత కళా ప్రాభవమ్ము ముక్కలు చెక్కలాయె తెలుగింటి ఘన కీర్తి ప్రకాశికలు కీలు బొమ్మలాయె ప్రజ స్వార్థ దుష్ట కీటకమ్ముల పాలుబడి తీర్చి దిద్దికొమ్మా నీ బిడ్డల ఐక్యతా భావమ్ముల తెలుగు తల్లీ

-వీర నరసింహరాజు.

Comments