వ్యాసభారతమే అసలైన భారతం..

ఈ మధ్య కొందరు మన ఇతిహాసమ్ముల మీద విపరీత వ్యాఖ్యలు చేయుచున్నారు.ఇటువంటివి కలిప్రభావమో విదేశీ భావజాలమో మరేమియో కానీ రానురానూ విపరీత ధోరణి పెరిగిపోవుచున్నది. భారతము బొంకని కొందరు లఘుబుద్ధుల ఉవాచ . మహాభారతమునందలి పాత్రలను వాటి వైశిష్ట్యమ్ములు తెలిసికొనక కేవలము వాటిని దాయాదుల మత్సరమ్ములు గల పాత్రలుగానే చదువుట వల్లనే ఇట్టి భావమ్ములు జనులయందు కలుగుచున్నవి .

మహా భారతము మహోత్కృష్ట గ్రంథ రాజము. దీనిని మన హైందవులు , హైందవేతరులు , దేశ విదేశ , ఖండాంతర వాసులు కూడా అత్యంత ధర్మ సూక్ష్మ ప్రామాణికమని నమ్మినారు. వ్యాస ప్రణీతము అయిన మహాభారతమునందు అనేక పాత్రలు, గుణగణాలు, నీతులు, రాజనీతి, మానవుడు ఈ ప్రపంచమున జీవించుటకు కావలసిన తెలుసుకొనవలసిన అనేకం అయిన ప్రాపంచిక విషయ విశేషాలు , రాజకీయాలు, హితము, ధర్మ మార్గంబులు ఇట్టివెన్నియో పాత్ర ముఖతా మహర్షి వేద వ్యాసులు మనకు చెప్పినారు . నీతి , ధర్మము బోధించు అనేక నీతిశాస్త్రములు మన భారతీయ వాంఙ్మయమున పెక్కులు గలవు. ఇతర శాస్త్రములందు నీతి, ధర్మ మార్గాలు మనకు నేరుగా చెప్పబడుట చేత చదువరులకు కాస్త ఆసక్తి తగ్గ వచ్చును. కానీ మహా భారతమునందు అనేక విషయాలు పాత్ర చిత్రణ ద్వారా చెప్పుట చేత అవి మనకు అత్యంత ఆసక్తిని కలుగ జేయుచూ ఆమూలాగ్రము ప్రతీ చిన్న విషయాన్ని చదివి ఆకళింపు జేసికొనునట్లు మహర్షి వాటిని చిత్రించినారు . అందుకే భారత పఠనం ప్రారంభించిన ప్రతి ఒక్కరు ఆమూలాగ్రము చదివి తరింతురు .

మహాభారతమునందలి పాత్రలు కేవలము పాత్రలు కావు. అనేక విషయాలు మనకు ఆయా పాత్రల స్వభావము వలన మనకు తెలియుచున్నది. అందువల్లనే భారతీయులు మహాభారతాన్ని అత్యంత ఆదరమ్మున పంచమ వేదము అను పేర పిలచినారు . మహర్షి ప్రణీతము అయిన ఈ మహోత్కృష్ట గ్రంథాన్ని పిమ్మటి కాలపు కవులు, పాండిత్యము గలవారు సంస్కృత భాష నుండి ఆయా భాషలకు అనువదించారు. అట్టి అనువాదమ్మున ఋషి ప్రోక్తములయిన పాత్రలకు, స్వభావాలకు, నీతులను మరింత రస రమ్యముగా చిత్రీకరించి పాఠకులను అలరించి వారికి ఆ ఉద్గ్రంథ సారాన్ని సులువుతర భాషలో అందజేయవచ్చును. కొంత వరకు కొందరు కవులు ఇట్టి విషయమున సఫలీకృతులయినారు.

వ్యాస భారతాన్ని ఆయన శిష్యులు జైమిని మళ్ళీ వ్రాసినారు . ఆ గ్రంథమున మహాభారత మూల గ్రంథమున లేని అనేక ఉపకథలు పెక్కు ఇందు చొప్పించబడినవి. దురదృష్టవశాత్తు నేడు మనకు ఈ జైమిని భారతము కొలది భాగము మాత్రమే లభ్యం అగుచున్నది . ఇంక ఆ తరువాత కాలమ్ములందు వచ్చిన కవి పండిత వర్యులు పెక్కురు తమకు విశ్వాసము అనిపించిన భావమ్ములనే కొన్ని పాత్రలకు ఆపాదించి వాటిని వక్రీకరించినారు. ఎట్టి కవి పండిత వర్యులు అయినా తమకు తోచిన విషయ విశేష భావాలు , స్వభావాలు కల పాత్రలను చిత్రీకరించి తమ స్వంత కాల్పనిక రచనలు చేయవచ్చును. కానీ ఋషిప్రోక్తములయిన వాటికి వక్రీకరణము చేయుట ఎట్టివారికినీ తగదు . ఋషిప్రోక్త రచనల స్వభావాలను మరింత రసరమ్యముగా తీర్చి దిద్దవచ్చు, కానీ మూలగ్రంథాల లోని పాత్రలకు తమ అల్ప భావాలను జోడించి వాటిని తద్విరుద్ధముగా చేయుట మహాదోషము. అది ఎట్టివారు చేసినా క్షమార్హము కాదు .

ఋషులు అందించిన జ్ఞానాన్ని భ్రమరమ్ములవలే మూలానికి చేటు రాకుండా అందలి మాధుర్యమును గ్రోలవలయును గానీ మూల గ్రంథాన్ని చెరచిన అది తనను రక్తమాంసాలు పంచి, ఎన్నియో దుర్భర వేదనలు అనుభవించి కని పాలిచ్చి పోషించిన కన్న తల్లిని వేశ్యావృత్తికి వినుయోగించినంత మహా పాపము అని నా అభి ప్రాయము. దురదృష్ట వశాత్తు అనేక వక్రీకరణలు తరువాతి కాలమ్ముల జనబాహుళ్యమున అవ్వియె నిజములని భ్రమసిపడే స్థితికి తీసుకు వచ్చినారు కొందరు కుకవులు . . మనము ఋషి ప్రణీతములైన వాటినే చదివి అందలి లక్ష్య లక్షణమ్ములను, నీతి నియమ యుగధర్మ, ధర్మ మార్గాలను, ఆపద్ధర్మ మార్గాలను తెలుసుకుని తరించాలి కానీ లఘుబుద్ధులమై, కుమతిత్వమ్మున మూల గ్రంథ స్వభావాలకు తద్విరుద్ధమగు భావనలను కల్పింపరాదు.

–వీర నరసింహరాజు.

Comments