సంగీత సాహిత్య సమలంకృతే

 

నారాయణ రెడ్డి గారి పాటలన్నా , కవిత్వమన్నా నటరత్న రామారావు గారికి ఎంత ప్రేమో.. తను నిర్మించిన చిత్రాలలో ఎన్నెన్నో మంచి పాటలు ఏరి కోరి మరీ వ్రాయించుకున్నారు. నారాయణ రెడ్డి గారి కలం బలం తెలిసిన రామారావు గారు వారి చేత తమ ఎన్ ఏ టీ బ్యానర్ మీద తీసిన గుళేభకావలి కథ 1962 చిత్రం కోసం పాటలు మొదటిసారిగా వ్రాయించారు.

అందరూ మొదట ఆయన కలం నుండి జాలువారిన పాట “నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని” పాట అనుకుంటారు. ఆయన మొదట ఆ చిత్రానికి వ్రాసిన పాట ” కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై ” , రెండవది నన్ను దోచుకుందువటే పాట .అందులో వారు వ్రాసిన ” మదనా సుందర నాదొర ” పాట అద్భుతమైన పదబంధాలతో అంతకు ముందు తెలుగుపాట పోని వింత పోకడలు పోయింది. అలా ఆ చిత్రం నుండి ప్రారంభమైన ఆయన సినీ జైత్ర యాత్ర అప్రతిహతంగా సాగిపోయింది.రామారావు గారి తరువాత వారి పిల్లలు కూడా తమ రామకృష్ణా హార్టికల్చర్ పతాకం పై తీసిన ” పెద్దన్నయ్య” చిత్రం కోసం ” కుటుంబం అన్నగారి కుటుంబం” అనే అద్భుతమైన పాట వ్రాయించుకున్నారు. వారి సినిమా గీతాల ఎన్నో మరపురాని పాటలు మనం అందరమూ వింటుంటే “సినారె ఏమి రాసినారె” అనిపించేంతగా ఉంటాయి ఇప్పటికీ ఎప్పటికీ.

ఒకప్పుడు పేపర్ తెరవగానే భాగ్యనగరములోని ప్రతీ సాహితీ సభకు చిన్న కవులు పెద్ద కవులు అనే తేడా లేకుండా ప్రతీ సభకు వారు హాజరు అయి అక్కడ ప్రసంగం చేసి వారి కవితా శక్తిని పొగిడి ఆశీర్వదించిన మహోన్నత హృదయుడు మన నారాయణ రెడ్డి గారు. వారు రాజ్యసభకు ఎన్నిక అయినపుడు అక్కడ సభలో అనేక ఉపన్యాసాలు చేసి అక్కడ సభికులకు తెలుగు వారి వాణి వినిపించారు.

నారాయణ రెడ్డి గారు వ్రాసిన గీత కృతులే కాదు వారు పేల్చిన చమత్కృతులూ ప్రసిద్ధమే . ఓ నాడు ఓ సభలో ఆయనకు సన్మానం చేస్తుంటే జనం సంద్రం లా ఉండటం చూసి ఎవరో ఇది మయసభ వలే తలపిస్తున్నది అని అనగా.. మయసభ పోలిక కంటే “వాజ్ఞ్మయసభ” అంటే మరింత సముచితంగా ఉంటుందని సెలవిచ్చారట. కారణం మయసభలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ అలాకాదే అని వారి వివరణ. వారు ఎంత గొప్పకవులో అంత గొప్ప వక్త. వారి కవితలు వారే స్వయంగా పాడి వినిపిస్తుంటే అత్యద్భుతంగా ఉండేవి. టీవీలకు ఇచ్చిన తన ఇంటర్వ్యూలలో తన గీతాలను మధురంగా ఆలపిస్తూ ప్రేక్షకులను మైమరపింప జేసేవారు.

వారి కవితా సదస్సుల్లో ఆరోజుల్లో కవితలను విలక్షణంగా శ్రావ్యంగా చదివి సాహితీ ప్రేమికులను ఆకట్టుకునే వారు. నారాయణ రెడ్డి గారి ప్రతిభకు అకాశమే హద్దు. అటు పద్య గేయ కవిత్వము, వచన కవిత్వము ప్రతీ రచనలోనూ సమోన్నత రచనా చమత్కృతి మనకు ప్రతీ పదములోనూ కనబడుతుంది . నారాయణ రెడ్డి గారి చిత్రగీతాలలో తెలుగు పాట వింత విన్యాసాలు చేసి కవ్య కన్యకలా నర్తించింది.నిర్మాత డి ఎల్ నారాయణ గారు, దర్శకుడు సి ఎస్ రావు గారు కవి సామ్రాట్ విశ్వనాథ వారి ” ఏకవీర” నవలను చిత్రంగా తీయాలని సంకల్పించినపుడు ఆ చిత్రానికి మాటలు, పాటలు మన నారాయణ రెడ్డి గారి చేతనే వ్రాయించారు . అందులో ప్రతీ పాటా ఒక సాహితీ సజీవ శిల్పమే.ముఖ్యంగా అమరశిల్పి జక్కన చిత్రములోని ఈ నల్లని రాళ్ళలో పాట వింటుంటే ఎనత్ అద్భుతంగా ఉంటుందో. దిగ్దర్శకుడు శ్రీ బి ఎన్ రెడ్డి గారు తాను శంభూ ఫిలింస్ వారికి తీసిన ” పూజా ఫలం ” చిత్రం కోసం నారాయణ రెడ్డి గారి దగ్గర వ్రాయించుకున్న “పగలే వెన్నెల జగమే ఊయల”, “నిన్నలేని అందమేదో” వంటి పాటలు సాహితీ వనములో విరిసిన దివ్య పారిజాత కుసుమాలు.

రెడ్డి గారు సినిమాలకు మూడు వేల పాటలకు పైగా రచించి ప్రేక్షకులకు మెప్పించారు. వారి విశ్వంభర , నాగార్జున సాగరం, కర్పూర వసంత రాయలు కావ్యాలు సాహితీ మణిపూసలు.ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు చాలవు వారి కవితాప్రౌఢి, వర్ణనా విలక్షణత్వం గూర్చి వ్రాయడానికి.

-వీర నరసింహరాజు

Comments