సమాజాభివృద్ధికి పునరంకితం కావడమే మహాసంకల్పం లక్ష్యం

అమరావతి: ‘‘నా కోసం కాదు, ఐదు కోట్ల మంది కోసమే ఈ మహా సంకల్పం. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. సమాజాభివృద్ధికి పునరంకితం కావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు దాటిపోయింది. ఈ సందర్భంగా జూన్‌ 2న నవనిర్మాణదీక్ష చేపడుతున్నాం. 8 వరకు కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజున మహాసంకల్పం ఉంటుంది’’ అని ఆయన వివరించారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనకు ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. సమన్యాయం చేయకుండా విడగొట్టారు. రాష్ట్రావతరణను పండగగా చేసుకోలేం. అలాగని నీరసించి కుంగిపోయి సాధించేదేముంది! అందుకే ఈ నవనిర్మాణ దీక్ష చేపడుతున్నాం. వచ్చే ఏడాది ఈ దీక్ష నాటికి ఏం సాధించాలో నిర్ణయించుకుని తదనుగుణంగా ముందుకెళ్తాం’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో సాధించిన ప్రగతిపై చర్చ ఉంటుందన్నారు. విజన్‌ 2020, 2029, 2050లపైనా చర్చించుకుంటామన్నారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎలా ఉందో పేర్కొంటూనే 175 నియోజకవర్గాలు ఏయే స్థానాల్లో ఉన్నాయో అయా ప్రాంతాల్లో వివరించబోతున్నామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఈ కార్యక్రమానికి అంతే ప్రాధాన్యం ఉందని దీనిని పాఠ్యాంశంగా చేసే విషయం ఆలోచిస్తామని చెప్పారు. ‘‘ఆ రోజు దిల్లీలో దీక్ష చేస్తోంటే జర్నలిస్టు కరణ్‌థాపర్‌ నన్ను ఏం ప్రశ్నించారో మీకు గుర్తుందా? సమన్యాయం కోసం పోరాడుతున్నా అని చెబితే ఆంధ్రాయో, తెలంగాణయో ఏదో ఒకటి చెప్పమన్నారు. రాష్ట్రం కోసం మీరు పొట్టి శ్రీరాములు ఎప్పుడవుతారని ప్రశ్నించారు. అందుకే కసితో ఎదగాలి. వృద్ధిలో మన రాష్ట్రం తొలిస్థానంలో ఉన్నా తలసరి ఆదాయంలో దక్షణాదిన అట్టడుగున ఉన్నాం. దీన్నిబట్టి ఎంత కష్టపడాలో గుర్తించాలి’’ అన్నారు.

Comments